If there are any errors in the script or the narration, please send a note to contact@gurukula.com
ఒకనాడు శంతన మహారాజు గంగానదీ తీరంలో వెళుతూండగా ఆయనకు ఒక అపురూపమయిన సౌందర్యవతి కనిపించింది. అయితే, ఆమె మానవరూపంలో ఉన్న గంగాదేవి అని శంతన మహారాజుకు తెలియదు. మహారాజు ఆమె అందానికి ఆకర్షితుడై తన మనస్సును, సమస్త రాజ్యాన్ని, సంపదను ఆమె పాదాల చెంత ఉంచి, తనను వివాహం చేసుకోమని కోరాడు.
గంగదేవి మహారాజు ప్రేమకు ఎంతగానో ప్రసన్నురాలయి ఇలా సమాధానం చెప్పింది. "మహారాజా! నేను ఒక నిబంధన మేరకు మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాను. మీరు నన్నెప్పుడూ, నేను ఎక్కడనుంచి వచ్చానని గానీ, నా పుట్టుకను గూర్చి గానీ అడగకూడదు. అంతేకాదు, నేను చేసే పనులు మంచివయినా, చెడువయినా, వాటిని ప్రశ్నించకూడదు. అన్నివేళ్ళల్లో నాకు అండగా ఉండాలి. మీరు గనక ఎప్పుడయినా ఈ నిబంధనకు విరుద్ధంగా ప్రవర్తిస్తే, నేను అప్పుడే అక్కడే మిమ్మల్ని విడచి వెళ్ళిపోతాను" .
శంతనమహారాజుకి గంగాదేవి పట్ల విపరీతమయిన ప్రేమ ఉండటం చేత, ఆ నిబంధనకు అంగీకరించాడు. వారి వివాహం జరిగింది.
అసలు గంగాదేవి ఇటువంటి నిబంధన ఏందుకు పెట్టింది? తెలిసి తెలిసి, ఏ వ్యక్తి అయినా ఇటువంటి నిబంధనకు అంగీకరిస్తారా? అని మీలో ఎవరయినా అడగచ్చు. వీటి కారణాలు ఈ కథలో తరువాత తెలుస్తాయి. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, గంగాదేవి అబద్దం చెప్పలేదు. ఆవిడ ముందుగానే తన అభిప్రాయం తెలిపింది. ఆ నిబంధనకు అంగీకరించి ఆమెను స్వీకరించాలో లేక వదిలి వెళ్ళిపోవాలో మహారాజే తేల్చుకోవాలి. ఇదే, ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే బంధుత్వాలలో ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక రెండవది, మన జీవితాల్లో కర్మసిద్ధాంతం ఎంతగా పనిచేస్తుందో, ఈ కధ ఉదాహరణలతో సహా చూపిస్తుంది. అంతేకాదు, ఒకప్పుడు చాలా విచిత్రంగా అనిపించే చర్య తరువాతి కాలంలో ఎంతో అర్థవంతంగానూ, సరిఅయినదిగానూ అనిపిస్తుందని కూడా తెలుసుకుంటాము.
శంతనమహారాజు, గంగాదేవి ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగించారు. గంగాదేవి స్వచ్ఛమయిన భావాలతో ఉండటం చేత శంతనుడు ఆమె పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు. ఇలా కాలం గడుస్తుండగా, వారికి మొదటి సంతానం కలిగింది.
బిడ్డ పుట్టగానే గంగాదేవి ఆ శిశువును గంగకు తీసుకువెళ్ళాక, నదిలో వదిలేసి తాను మాత్రము చిరునవ్వుతో రాజ్యానికి తిరిగి వచ్చింది. శంతనుడు భయంతో నివ్వెరపోయాడు. జరిగింది నమ్మలేకపోయాడు. కానీ, తాను గంగాదేవికి ఇచ్చిన మాట ప్రకారం, ఆమెను ఏమీ అడగకుండానే ఊరుకున్నాడు.
సంవత్సరాలు గడుస్తూండగా, గంగాదేవి మరో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారందరికీ అదే గతి పట్టింది. ఒక్కొక్క బిడ్డ పుట్టగానే, ఆమె ఆ పసిబిడ్డను నదిలోకి వదిలేసేది. మహారాజుకు విపరీత దుఃఖం కలిగినా, ఎంతో నిగ్రహంతో బాధను భరించేవాడు కానీ, ఆమెను ఏమీ అడిగేవాడు కాదు.
ఎనిమిదవ బిడ్డ పుట్టగానే గంగాదేవి ఆ పసికందుని తీసుకొని నదివైపు నడవటం మొదలుపెట్టింది. శంతనమహారాజు ఇక ఆపుకోలేక ఆవేశంతో ఇలా అరిచాడు "ఆగు! ఓ కఠినత్మురలా, ఆగు! ఇటువంటి దారుణమయిన, ఏతల్లీ చేయలేనటువంటి కౄరమయిన పనిని నీవెందుకు చేస్తున్నావు? నువ్వు ఎంతటి రూపవతివో అంతటి వెర్రిదానవు, వివేకం లేని దానవు".
ఎంతటి గొప్ప బంధుత్వాలలో అయినా అపార్ధాలు, పోట్లాటలు రావచ్చు. తప్పొప్పులతో సంబంధం లేకుండా, ఒకరు చేసిన పని మరొకరికి నచ్చనప్పుడు తగాదా రాక మానదు. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు తగాదా రాకుండా తప్పించటం కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల, ఎదుటివారితో అంగీకరించనప్పుడు మనము ఏవిధంగా ఆ పరిస్థితిని చక్కబెడతామనేది చాలా ముఖ్యము.
శంతనుడు గంగాదేవిని ఈ దారుణమయిన పనిని చేయటం ఆపటంతో, ఆవిడ ఇలా అన్నది: "మహారాజా! మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అయితే, వెళ్ళేముందు నేను నా పుట్టుకను గూర్చి, నా చర్యలకు కారణాలను గూర్చి మీకు చెప్తాను. నేను, వశిష్ఠమహర్షి అష్ట వసువులకు ఇచ్చిన శాప ఫలితంగా మానవరూపాన్ని ధరించిన గంగాదేవిని.
హిందూధర్మంలో వసువులు ఇంద్రునికి, విష్ణువుకి సేవకులైన దేవతలు. వారు ఎనిమిది ప్రకృతులకు ప్రతినిధులుగా ఉన్న దైవ స్వరూపాలు. ఈ ఎనినిది దైవస్వ రూపాలు ముప్పైమూడు మంది దేవతలలోని వారు. వసు అనగా "నివసించేవాడు" లేక "నివసించునది" అని అర్ధం.
ఆ ఎనిమిది వసువులు ఎవరో చెప్పలంటే,
అనల - "అగ్ని"
ధర " "భూమి"
అనిల " "వాయువు"
అహ " "అంతరిక్షము"
ప్రత్యూష " "సూర్యుడు"
ప్రభాస " "ఆకాశము"
సోమ " "చంద్రుడు"
ధ్రువ " "నక్షత్రాలు"
గంగదేవి ఇలా చెప్పసాగింది, "ఒకానొక రోజు ఈ అష్ట వసువులు భార్యలతో కలిసి విహరిస్తూ వసిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా వెళ్ళారు. అక్కడ వారు వశిష్టుని దివ్యమయిన గోవు, నందినీ ధేనువును చూసారు. అష్టవసువులలోని ప్రభాసుని భార్య, ఆ దివ్య తేజస్సుతో కూడిన గోవును తనకోసం తెచ్చి ఇవ్వమని భర్తను కోరింది. అందుకు ప్రభాసుడు "ప్రియా! మనము దేవతలము. మనకు గోవు, గోవుపాలు ఎలా ఉపయోగపడతాయి? ఈ నందినిగోవు యొక్క పాలు మరణము లేని అమరత్వాన్ని ఇవ్వగలిగినప్పటికీ, మనము దేవతలమవటం చేత ఇప్పటికే అమరత్వాన్ని కలిగి ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా వసిష్ఠ మహర్షికి ఈ గోవు అంటే చాలా ఇష్టము. ఆయనకి తెలియకుండా, ఆయన యొక్క సొత్తును తీసుకువెళ్ళటం మనకు తగదు". ప్రభాసుడు ఎన్ని రకాలుగా చెప్పినా, ఆయన భార్య వినకపోగా, పదే పదే దానినే కోరటం చేత , ఆయన కూడా అంగీకరించవలసి వచ్చింది. ఆ విధంగా అష్టవసువులు నందినీ గోవును, దాని దూడను ఆశ్రమం నుంచి బలవంతంగా తీసుకుని, వశిష్ఠ మహర్షి వచ్చేలోగా అక్కడినుంచి అదృశ్యమయ్యారు.
వశిష్ఠుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి, నందినీ ధేనువు లేకపోవటము గమనించాడు. తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని, అష్టవసువులను ఈ భూమిపై మరణం కలిగిన మానవులుగా జన్మించమని శపించాడు.
దేవతలు స్వర్గంలో సర్వ సుఖాలను, మరణమనేది లేకుండా అమరత్వాన్ని అనుభవిస్తూ ఆనందిస్తుంటారు. అటువంటి వారికి మానవులుగా జన్మించి, మనము అనుభవించే బాధలను, కష్టాలను భరిస్తూ జీవించటము ఒక భయంకరమయిన అనుభవము.
గంగదేవి ఇంకా ఇలా చెప్పసాగింది. అష్టవసువులకు ఈ శాపం విషయం తెలియగానే వారు వశిష్ఠ మహర్షి వద్దకు పరుగెత్తి , ఆయన పాదాలపైపడి క్షమాభిక్షను వేడుకున్నారు. దానికి వశిష్ఠుడు, తన శాపాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యంకాదని , కానీ శాపప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందంటూ ఇలా చెప్పసాగాడు. "మీరు గంగాదేవి దగ్గరకు వెళ్ళి, ఈ భూమిపై ఆమెను మీకు తల్లిగా ఉండమని వేడుకోండి. మీరు పుట్టగానే మీకు మానవ జన్మ నుండి విముక్తిని కలిగించి, మీరు ఎక్కువ కాలం మనుష్యులుగా కష్టపడకుండా, త్వరగా తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయేలా చేయమని అడగండి. కానీ ఇలా శాపం యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం గోవును దొంగతనం చేయటంలో ప్రభాసునికి సహాయం చేసిన ఏడు గురికి మాత్రమే ఉంటుంది. గోవును దొంగతనం చేసింది ప్రభాసుడే కనుక, అతని పట్ల మాత్రం ఈ శాపం పూర్తిగా పనిచేస్తుంది. అతడు భూమిపై మానవుడిగా జీవించవలసిందే. కానీ అతను ఉత్తమమయిన జీవితాన్ని గడిపి, మహాత్ములలో ఒకరిగా గౌరవించబడతాడు." అని చెప్పి వశిష్థ మహర్షి ధ్యానంలోకి వెళ్లిపోయారు."
వశిష్ఠుని మాటలకు ఊరట చెందిన వసువులు, గంగాదేవి దగ్గరకు వెళ్లి, ఆమెను భూలోకంలో తమ తల్లిగా ఉండమని వేడుకున్నారు. అంతేకాదు, వారు పుట్టగానే వారిని నదిలోకి వదిలేయవలసిందిగా కోరుకున్నారు. గంగాదేవి కూడా వారి కోరికను మన్నించి, అంగీకరించింది. ఇదంతా జరగటానికే, గంగాదేవి మానవరూపంలో భూమి మీదకు వచ్చి, శంతనుడికి భార్య అయినది.
గంగాదేవి చర్యలకు కారణాలు విన్నాక, ఆవిడ చెసినదంతా అర్ధవంతంగా అనిపిస్తోంది కదూ? దేవతలు సాధ్యమయినంత త్వరగా తిరిగి తమ నివాసానికి చేరటం సరైనదిగానే అనిపిస్తోంది. మరి అలా జరగాలంటే, వారు పుట్టగానే మరణించటమే ఉచితమని కూడా తోస్తుంది.
శంతనుడు ఈ కారణాన్ని అర్ధం చేసుకునేవాడా? గంగాదేవి ముందుగానే ఆయనకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? అని ఎవరయినా అడగవచ్చు. కారణం చెబితే, మహారాజు ఆమెను జరగవలసినదానికి విరుద్ధంగా ఒప్పించే ప్రయత్నం చెయ్యచ్చు లేదా మొదటి ఏడుగురు బిడ్డలని
పోగొట్టుకుంటానని తెలిసి క్రుంగిపోయుండవచ్చు. ఏది ఏమయినా, మనము ఎంత ఆలోచించినా, ఈ ప్రశ్నలకు తృప్తికరమయిన సమాధానాలు దొరకకపోవచ్చు. విధి విలాసంలో జరిగే ప్రతి విషయానికీ ఒక ప్రయోజనం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయోజనం ఏమిటో మనకు తెలిసినా తెలియకపోయినా, అది ఉండి తీరుతుంది. కర్మ సిద్ధాంతం యొక్క తీరుతెన్నులను గురించి వీరి కథ మనకు చక్కటి పాఠం నేర్పుతుంది.
ఇంతకీ ఆ ఎనిమిదవ బిడ్డకు ఏమయింది? జరిగినదంతా శంతన మహారాజుకి చెప్పి, గంగాదేవి ఆయనను విడచి, వారి ఎనిమిదవ సంతనాన్ని తనతో తీసుకువెళ్లింది. ఆ బిడ్డ యువకునిగా ఎదిగాక, గంగాదేవి అతనిని మహారాజు దగ్గరకు తీసుకువచ్చి ఇలా అన్నది.
"మహారాజా! ఈ పిల్లవాడే మన ఎనిమిదవ సంతానము, దేవవ్రతుడు. దేవవ్రతుడు వసిష్ఠ మహర్షి దగ్గర వేదాలను, పరశురాముని నుండి యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు. సకల శాస్త్రాలలోను, విలువిద్యలోను ఆరితేరాడు."
దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న తన కుడుకుని తిరిగి పొందినందుకు శంతన మహారాజు ఆనందంతో
ఉప్పొంగిపోయాడు. ఆ క్షణం నుండి అతనిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఈ దేవవ్రతుడే
పెరిగి పెద్దవాడయి "భీష్మ" అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు.