If there are any errors in the script or the narration, please send a note to contact@seva.gurukula.com
పంచతంత్రం క్రీస్తుపూర్వం 300 ల సంవత్సరంలో విష్ణు శర్మచే చెప్పబడిన నీతి శాస్త్ర గ్రంథము. ఈ గ్రంథము మనసుకు హత్తుకునే జంతువుల కథల ద్వారా మనకు జీవిత పాఠాలను నేర్పుతుంది.
నీతి అనగా, “లోకజ్ఞానం”, లేదా తేలికగా చెప్పాలంటే , “తెలివిగా జీవనము సాగించడం” అని అర్ధం. జీవితంలో మనం విజ్ఞానశాస్త్రాలు, లలిత కళలు, కంప్యూటర్లు, వైద్యశాస్త్రం మొదలైనవి ఎన్నో నేర్చుకుంటాము. లోకజ్ఞానం లేకుంటే ఇవేవీ ఉపయోగపడవు. దురదృష్టవశాత్తు, లోకజ్ఞానం అనేది చాలా సాధారణ విషయం అనుకుంటారు కాబట్టి దీనిని ఒక పాఠ్యాంశంగా పాఠశాలలో బోధించరు. కానీ, మనకు పంచతంత్రం ఉండడం వల్ల ఆ విషయంలో మనం అదృష్టవంతులం.
ఈ నీతి శాస్త్రం, “నాకు భద్రత యొక్క అవసరాన్ని, ధనము యొక్క అవసరాన్ని”, “సమర్ధవంతంగా పనులు చేయడం గురించి”, “మంచి మిత్రుల అవసరాన్ని”, “తెలివిగా జీవనము సాగించడము” వంటి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తుంది. "నీతి" అనే ఒక్క పదంలో ఇంత అర్థం ఉండడం ఎంతో అద్భుతం.
ఇక పంచతంత్ర కథలు ఎలా చెప్పబడ్డాయో తెలుసుకుందామ?
ఒకప్పుడు మహిలారోప్య అనే రాజ్యానికి అమరశక్తి అనే రాజు ఉండేవాడు. రాజు ఒక పండితుడు మరియు గొప్ప పాలకుడు అయినప్పటికీ, అతని ముగ్గురు కుమారులు బహుశక్తి, ఉగ్రశక్తి మరియు అనంతశక్తి మూర్ఖులు. రాజు విచారంతో “నా పిల్లలు ఒక రోజు పెరిగి పెద్దవారవుతారు. నా తర్వాత వారు ఈ రాజ్యాన్ని పాలించవలసి ఉంటుంది. వారికి ప్రభుత్వం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ ఏమీ తెలియదు, జీవితంపై అవగాహన కూడా లేదు. వారికి ఇవన్నీ నేర్పించడానికి నేను ఏం చేయాలి ? అయ్యో! వారు ఎలాంటి విద్యనూ అర్థం చేసుకోగలిగే స్థితిలో లేరే!" అని తనలో తాను అనుకున్నాడు.
రాజు తన మంత్రులను సమావేశపరిచి వారి సలహా కోరాడు.
అతని మంత్రులు, “ఓ రాజా! వ్యాకరణం నేర్చుకోవడానికే కనీసం పన్నెండు సంవత్సరములు పడుతుంది. అది ఒక్కటే కాకుండా, రాకుమారులు అర్థ శాస్త్రం, కామ శాస్త్రం మరియు మనుశాస్త్రం కూడా నేర్చుకోవాలి, దీనికి ఇంకా చాలా సమయం పడుతుంది." అని అన్నారు.
రాజు చాలా నిరాశ చెందాడు. అతనికి తన కుమారులు ఎప్పటికైనా పండితులు కాగలరనే నమ్మకం పోయింది.
మంత్రి చెప్పడం కొనసాగించాడు, “అయితే విష్ణు శర్మ అనే ఒక పండితుడు ఉన్నాడు. అతడు నీతి శాస్త్రంలో నిపుణుడు. రాకుమారులకు విద్యను బోధించమని మనం వారిని అడగవచ్చు." అది విన్న రాజుగారిలో ఆశ చిగురించింది.
విష్ణు శర్మ పిలిపించబడ్డాడు. రాజుకు అభివాదం చేసిన తరువాత అతడు రాజు యొక్క బాధలు విన్నాడు. రాజు తన ముగ్గురు కుమారుల గురించి, వారికి విద్యను నేర్పించవలసిన అవసరం గురించి అతనికి వివరించాడు. విష్ణు శర్మ బోధనకు గురుదక్షిణగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని రాజు వాగ్దానం చేసాడు.
దానికి విష్ణు శర్మ “ఓ రాజా ! నేను మీ కుమారులకు విద్యను బోధిస్తాను, కానీ నాకు డబ్బు అవసరం లేదు. నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరములు. నేను భౌతిక సంపదపై ఆసక్తిని అంతా కోల్పోయాను. నేను కేవలం మీ మేలు కొరకే, దీన్ని చేస్తాను. మీ కుమారులను ఈ రోజు నుండి ఆరు నెలలలో నీతి శాస్త్రంలో నిపుణులను చేయకపోతే, మీరు నన్ను దండించవచ్చు”. అని సమాధానం ఇచ్చాడు.
సాహసంతో కూడిన ఈ మాటను విని రాజు ఆశ్చర్యపోయాడు. కానీ, చివరకు తన కుమారులకు విద్య నేర్పించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నందుకు అతడు సంతోషించాడు. అతడు విష్ణు శర్మకు తన కుమారులను అప్పగించాడు.
విష్ణు శర్మ ఆ ముగ్గురు రాజకుమారులకు ఐదు తంత్రాలతో కూడిన పంచతంత్ర కథలను బోధించడం ప్రారంభించాడు.
మొదటి తంత్రం మిత్ర భేదం. అనగా “స్నేహితులను కోల్పోవడం”. మిత్రులను కోల్పోవడం వల్ల శత్రువు బలవంతుడు అవుతాడు. ఈ తంత్రం విరోధులు లేదా శత్రువుల కారణంగా మంచి స్నేహితులను ఎలా కోల్పోతామో అవగాహన కల్పిస్తుంది.
రెండవ తంత్రం మిత్ర సంప్రాప్తి. అనగా “స్నేహితులను గెలవడం”. స్నేహితులను పోగొట్టుకుంటే తిరిగి ఎలా పొందవచ్చో ఈ తంత్రం బోధిస్తుంది. ఇది పరస్పర ప్రయోజనం కోసం స్నేహాన్ని ఎలా పెంచుకోవచ్చో కూడా వివరిస్తుంది.
మూడవ తంత్రం కాకోలూకీయం, అనగా “కాకులు మరియు గుడ్లగూబలు”. ఈ తంత్రం శత్రువులను బలహీన పరచడానికి, మోసంతో వారి మధ్య అపార్థాన్ని ఎలా సృష్టించవచ్చో వివరిస్తుంది. ఆ విషయాన్ని ఈ తంత్రం కాకులు మరియు గుడ్లగూబల మధ్య శత్రుత్వాన్ని, మరియు ఒక దానిని మరియొకటి ఎలా అణచివేస్తాయో చూపించడం ద్వారా మనకు తెలియజేస్తుంది.
నాలుగవ తంత్రం లబ్ధ ప్రనాశం, అనగా “లాభహాని.” సరైన జాగ్రత్త తీసుకోకుండా ఉంటే అంతవరకూ సంపాదించిన దానిని ఎలా కోల్పోతామో ఈ తంత్రం వివరిస్తుంది.
ఐదవది మరియు ఆఖరి తంత్రం అపరీక్షిత కారకం, అనగా “నిర్లక్ష్యముతో కూడిన పనులు”. కలగబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా పనులు చేయడం వల్ల కలిగే చెడు ఫలితాలను ఈ తంత్రం వివరిస్తుంది.
నేను ఈ పంచతంత్ర కథనమును నా ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నాను. వారిలో మొదటి మరియు అతి ముఖ్యమైన వారు మా అమ్మగారు.
ఈ కథలను చెబుతూ నేను ఎంతగా ఆనందించానో, అంతగా మీరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను...