పోతన భాగవతం
Language

 

All content is owned and created by bhagavatamanimutyalu.org who have graciously made it available in the Gurukula platform

 

పద్యము

ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టి వాఁడు నవ్యచరిత్రా!

 

సందర్భం

నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రజ్ఞగల సూతుడు, భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు- అని చెప్పగా శౌనకుడు, "అయ్యా శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కరలేదే. అతడు దేనినీ పట్టించుకోడే. అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు" అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు.

 

తాత్పర్యము

మహర్షీ! నీ నడవడి కొనియాడదగినదయ్యా! విను. నీప్రశ్నకు బదులు చెబుతాను. గొప్పబుద్ధితో విలాసంగా విహరించేవారూ, ఏ అపేక్షతో అంటుసొంటులు లేనివారూ, ఆత్మతత్త్వమునందే ఆనందంపొందే శీలం కలవారూ అయిన మునులు శ్రీమహావిష్ణువు భజనను ఏ కారణమూ లేకుండానే చేస్తూ ఉంటారయ్యా! ఆ నారాయణుడు అటువంటి వాడు! ఏ కోరికా లేనివారికి కూడా అతనిని పూజించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది.

 

ప్రతిపదార్ధము

ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్ = దేనియందు ఆపేక్షలేని వారు; ఆత్మారాములున్ = ఆత్మయందు ఆనందించువారును; ఐన = అయినట్టి; మునులు = మునులు; హరి = హరియొక్క; భజనమున్ = సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేమియు లేకనే; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉంటారు; నారాయణుఁడు = నారాయణుడు; అట్టి = అటువంటి; వాఁడు = వాడు; నవ్య = నవ్య మైన; చరిత్రా = చరిత్ర కలవాడా