నాలుగుమోముల దేవర బ్రహ్మయ్య. జ్ఞానవిజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగుమోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తన నోటి నుండి భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆ పరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధుర మంజుల వాక్కులతో బ్రహ్మను కొనియాడు తున్నాడు.
బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేల? కాబట్టి ఉత్తమ పురుషు డైన పోతనామాత్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏవిధమైన విఘ్నాలూ కలుగ కూడదని గజాననునికి మ్రొక్కులు చెల్లిస్తున్నాడు.
హృదయంలో భవ్యమైన భావన కదలాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ భావన పలుకుగా రూపం దిద్దుకొని నాలుకపై నాట్యమాడాలంటే ఆయమ్మ చల్లనిచూపు జాలువారాలి. అందునా పలుకబోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సరస్వతి సదమలకృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమె దయకోసం ప్రార్థిస్తున్నాడు.
"దుర్గామ్ దేవీం శరణ మహం ప్రపద్యే" అనమంటున్నది వేదమాత. 'నేను దుర్గాదేవి శరణు పొందుతాను' అనుకుంటూ ఆ పని చేయాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గా దేవిని స్తుతిస్తూ, తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని తరించమంటున్నాడు.
ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికీ అమ్మలాగా సర్వమూ అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. . పోతనామాత్యులు ఇందిరా మాతను ఇలా ప్రార్థిస్తున్నారు .
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్ప తపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు
పోతన మహాకవీంద్రులకు చదువులతల్లి సాక్షాత్కరించింది. ఆమె దర్శనం ఆయనకు ఆనందపారవశ్యం కలిగించలేదు. గుండెను తల్లడిల్లజేసింది. ఆ భారతితో ఈ భారతీపరిచారకుడు ఇలా అంటున్నాడు
తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాలకోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడుపనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.
మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి. అలాకాకపోతే వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించు కోలేడు. అప్పుడు అతడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.
పోతనమహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమోడ్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతనమహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు.
శ్రీరామచంద్రుడు నాపేరు పేర్కొంటూ శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా! దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలయిపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నాడు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావననుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది.
పోతన తన అదృష్టాన్ని తానై కొనియాడుకొంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయతిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభావించుకుంటూ లోపలలోపల మహాకవుల మహోన్నత వైభవాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు.
కరుణావరుణాలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కానీ అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. దానిని లోకానికి తెలియజేస్తున్నాడు పోతన మహాకవి.
భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది పోతన మహాకవీంద్రునకు. కల్పవృక్షం కోరిన కోరికలనన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన గారి సంభావన.
మన కావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తన కావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తున్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆ విశేషణాలన్నీ షష్ఠీవిభక్తితో అంతమౌతూ ఉంటాయి. కనుక వానిని షష్ఠ్యంతాలు అంటారు. పోతన కవీంద్రుడు ఆ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు.
అనంత కల్యాణ గుణసంపన్నుడైన శ్రీకృష్ణస్వామి భగవల్లక్షణాలను మరింత ఆనందపు పొంగులతో అభివర్ణించి మురిసిపోతున్నాడు పోతన. మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తున్నాడు.