పోతన భాగవతం
Language

 

All content is owned and created by bhagavatamanimutyalu.org who have graciously made it available in the Gurukula platform

 

పద్యము

మెఱుగు చెంగట నున్న మేఘంబుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగిబలువిల్లు మూపున పరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానునిభంగి ఘనకిరీటము దల గల్గువాడు

(ఆటవెలది).

పుండరీకయుగము పోలు కన్నులవాడు
వెడద యురమువాడు విపులభద్ర
మూర్తివాడు రాజముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదర గానబడియె.

 

సందర్భం

పోతనమహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమోడ్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతనమహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు.

 

తాత్పర్యము

మెఱుపుతీగను అంటిపెట్టుకొని ఉన్న మేఘంలాగా జానకీకాంత చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్నినవ్వు పుట్టుకొని వస్తున్నది. అది చంద్రబింబంనుండి వెలువడే అమృతపు జల్లుగా ఉన్నది. పెద్ద విల్లు భుజంమీద అలరారుతూ ఉంటే లత చుట్టుకొన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తున్నాడు. నల్లనికొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదురుకొని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షఃస్థలం అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపునుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతున్నాడు. అట్టి రాజముఖ్యుడొకడునా కన్నులయెదుట కానవచ్చాడు.

 

ప్రతిపదార్ధము

మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య), లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు = వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాఁడు = వాడు; వల్లీయుత = పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు = ప్రవర్తిల్లే; వాఁడు = వాడు; నీల = నీల; నగ = గిరి; అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగు = కల; వాఁడు = వాడు;

పుండరీక = పద్మముల, తెల్లతామరల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వాఁడు = వాడు; వెడఁద = విశాలమైన; ఉరము = వక్షముగల; వాఁడు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; వాఁడు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుఁడు = ముఖ్యమైనవాడు; ఒక్కరుఁడు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్ = కళ్ళ; గవ = జంట; కున్ = కు; ఎదురన్ = ఎదురగ; కానఁబడియె = సాక్షత్కరించెను;