పోతన భాగవతం
Language
gurukula-audio-image
0.002.09
icon-rewindicon-playicon-forward
icon-volume

 

All content is owned and created by bhagavatamanimutyalu.org who have graciously made it available in the Gurukula platform

 

పద్యము

పలికెడిది భాగవత మట;
పలికించు విభుండు రామభద్రుండట; నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొండుగాధ పలుకగ నేలా.

 

సందర్భం

శ్రీరామచంద్రుడు నాపేరు పేర్కొంటూ శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా! దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలయిపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నాడు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావననుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది.

 

తాత్పర్యము

ఏమిటేమిటి? నేను పలుకబోతున్నది భగవంతుని అమృతంవంటి చరిత్రమట! ఏదో నేను పలుకుతున్నాననుకొంటున్నాను, కానీ నన్ను పలికించేవాడు సాక్షాత్తూ పరమాత్మయే అయిన ఆ రామభద్రుడట! పలికితే కలిగే ఫలం సంసారం అనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అట! అటువంటి కార్యమూ, ఆ విధంగా చేయించే స్వామి! అంత అనితరసాధారణమైన ఫలమూ సమకూరుతూ ఉండగా మఱొక గాధను పలుకవలసిన పనియేమున్నది? కాబట్టి భాగవత గాధనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను.

 

ప్రతిపదార్ధము

పలికెడిది = పలుకు నది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించు = పలికించెడి; విభుండు = ప్రభువు; రామభద్రుండు = శ్రీరాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = చెప్తే; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగు నఁట = అవుతుం దట; పలికెద = (అందుకే) నే చెప్తాను; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.